భూ సమస్య పరిష్కారం కావడం లేదని పురుగుల మందు తాగిన రైతు..    నారాయణపేట కలెక్టరేట్‌‌‌‌ లో ఘటన

భూ సమస్య పరిష్కారం కావడం లేదని పురుగుల మందు తాగిన రైతు..    నారాయణపేట కలెక్టరేట్‌‌‌‌ లో ఘటన

నారాయణపేట, వెలుగు : భూ సమస్య పరిష్కారం కావడం లేదన్న మనస్తాపంతో ఓ రైతు ప్రజావాణికి వచ్చి కలెక్టరేట్‌‌‌‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన నారాయణపేట కలెక్టరేట్‌‌‌‌లో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్‌‌‌‌పల్లిలోని  నడిమింటి కనకప్పకు చెందిన 31 గుంటల భూమి తన అన్న పెద్దకనకప్ప భార్య హనుమమ్మ కబ్జాలో ఉంది.

ఈ భూమిని తనకు స్వాధీనం చేయాలని గ్రామంలో పలుమార్లు పంచాయతీలు జరిగినా సమస్య పరిష్కారం కాలేదు. రెండేండ్లుగా దామరగిద్ద తహసీల్దార్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌, నారాయణపేట కలెక్టరేట్‌‌‌‌లో ఫిర్యాదులు చేసినా ఎవరూఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌‌‌‌లో జరిగిన ప్రజావాణికి వచ్చిన కనకప్ప అక్కడే పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించాడు.

అక్కడే విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గమనించి కనకప్ప చేతిలోని పురుగుల మందు డబ్బాను లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం కలెక్టరేట్‌‌‌‌ సిబ్బంది రైతు కనకప్పను జిల్లా హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. కాగా, ఆత్మహత్య పేరుతో బెదిరించి భూమి సొంతం చేసుకోవాలని చూస్తున్నారని హనుమమ్మ ఆరోపించింది.

సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌‌‌‌కు వచ్చిన ఆమె.. ఎల్సన్‌‌‌‌పల్లి శివారులో 40 ఏండ్ల కింద భూమిని కొనుగోలు చేసి అన్నదమ్ములు పంచుకున్నారన్నారు. ఈ భూమి విషయంపై కోర్టులో నడుస్తోందని చెప్పారు. అయినప్పటికీ భూమిని అక్రమంగా సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఆత్మహత్య నాటకం ఆడారని ఆరోపించారు.